vipanchi

vipanchi

14, నవంబర్ 2013, గురువారం

ఓ రాతిరి!

ఉలికి ఉలికి పడుతోంది,
ఏదో చెప్పాలని పదాలు వెతుక్కుంటోంది....

అదీ, ఇదీ అనుకుంటూ ముళ్ళు పెట్టుకుంటోంది,
కొన్ని తేలిగ్గా లాగెయ్యగల ఉచ్చు ముళ్ళు,
కొన్ని విప్పలేని పీటముళ్ళు, లాగేకొద్దీ బిగుసుకునే చిక్కుముళ్ళు.....

అల్లిబిల్లిగా అల్లుకుపోతున్న ఆలోచనల వలలు,
చిక్కుబడి కాలుసాగక స్థబ్దుగా నిలిచిపోతోంది.
రాతిరి దొర్లిపోతోంది, జాబిలి వడివడిగా ఆదరికేసి జరిగిపోతోంది...
మబ్బులు ఎవరో తరుముతున్నట్టు అటూ,ఇటూ పరుగులెడుతున్నాయి.....

తను మాత్రం నిలిచిపోయింది,
వెనక్కి వెనక్కి జరిగిపోతోంది...
అవి ఏవో తెలియని చీకట్లలోకి,
నల్లగా మూసుకుపోతున్న దిగంతాలలోకి.........

6, నవంబర్ 2013, బుధవారం

హృదయరాగం

స్మృతులో, అనుభూతులో, కదిలే కాలపు మరీచికలో,
ముప్పిరిగొనే ఆశలో, చిప్పిల్లి ఎగసే ఆనందపు జల్లులో......
అవి ఏవో కలబోసి, నాలోని నన్ను కదిలించి, మేళవించి,
కొనగోట మీటితే, అలలలలుగా పలికే  హృదయరాగం,
ఈ విపంచికా గానం..........

భావాలో, భావనలో పెనగొని ఉక్కిరిబిక్కిరైన వేళ,
తలపుల వాగురలో చిక్కుకొని ఊగిసలాడిన వేళ,
అది ఏదో తెలియక గుండెబరువెక్కిన వేళ,
మాట పెగలక, ఊపిరిగొంతుక మధ్యన చిక్కుబడినవేళ,
నినదించే నాదం, ఈ విపంచికా గానం.......

నిలిచిన చూపుల తపనలో,
ఆశగా కదిలిన కొసకంటి నీటి చినుకులో,
తడబడి తెరువు వెతికిన బేల చూపులలో,
విప్పారిన కనుపొట్ల మజ్జెన వెలిగిన వెలుగులలో,
పచరించు సరాగం, ఈ విపంచికాగానం.....

అట్టడుగున సద్దుసేయక ఒగియున్నదిన్నాళ్ళు,
తెరువు తోచినంతన, తబ్బిబ్బై దడిదూకి పలుకునిక
నా గుండెగొంతుక, ఈ విపంచికా రాగాలలో.....